నేను బాకీ వుంది ఆయనకే 3 76

అతను కొంచెంసేపు ఆగి “మీరు అద్భుతంగా వీణ వాయిస్తారని విన్నాను. నాకు వినాలని వుంది. అయితే అందరూ వున్నప్పుడు మీరు వాయిస్తానంటే కుదరదు. నాకు అలా ఇష్టం వుండదు. మనం యిద్దరమే వుండాలి. మీరు అలా కూర్చుని వాయిస్తుంటే వినాలి. అప్పుడు విధిగా వెన్నెల వుండాలి. ఆ వెలుతురులో మీరు వీణ మీటుతుంటే నేను వినాలి” అన్నాడు. ఇదంతా చెబుతున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ తో అతని కంఠం బరువుగా వినబడింది.

నేను చిన్న జర్క్ ఇచ్చాను. ఎప్పుడో పెళ్ళికి ముందు వీణ నేర్చుకున్నాను. పెళ్ళయిన తరువాత ఎప్పుడైనా ఒంటరిగా వున్నప్పుడు అలా రెండు మూడు రాగాలు వాయించేదాన్ని. మావారు ఎప్పుడూ వీణ వాయించమని అడగలేదు. నేను ఆయన ముందు నా విద్య ప్రదర్శించలేదు. ఆ తరువాత అప్పుడప్పుడూ కూడా వీణ జోలికి పోలేదు.

ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ఓ వ్యక్తి వీణ వాయించమని అడుగుతున్నాడు. అదీ వెన్నెల్లో ప్రత్యేకంగా అతని కోసమే వాయించాలాట. నా గుండె జల్లుమంది. నా చిన్నతనం, అప్పట్లో వీణ నేర్చుకోవడం కోసం మాస్టారు దగ్గరికి వెళ్లడం, నేర్చుకున్న విద్యను అమ్మమ్మ దగ్గర ప్రదర్శించడం గుర్తొచ్చాయి.

వెన్నెల్లో తనకోసమే వీణ వాయించాలన్న కోరిక కోరడం వెనుక అతని కళాతృష్ణ, సౌందర్య భావన ఏదయినా అనుభవాన్ని గాఢంగా అనుభవించాలన్న తపన నాక్కనిపించాయి.

నేను ఏమీ జవాబు చెప్పలేదు. అదో రకమైన మైల్టు షాక్ తో అలా మౌనంగా వుండిపోయాను.

అంతలో అతని మిత్రులు వచ్చారు. తిరిగి కాఫీలు, సిగరెట్లలో పడిపోయారు. ఏ దురలవాట్లూ లేకుండా, ఎప్పుడూ ఏదో మూడీగా, సౌమ్యంగా వున్న మా ఆయన్ను చూసీ చూసీ విసుగేయడంవల్ల అనుకుంటాను అతని విశృంఖలత అదో ఆకర్షణగా కనిపించింది.

ఇలా అతను అడిగిన వారం రోజులకనుకుంటాను. మావారు పనిమీద ఒంగోలు వెళ్ళారు. రెండు రోజులు రారు. ఆయన వెళ్ళిన సాయంకాలమే నేను పిల్లల్ని తీసుకుని చంద్రగిరి వెళ్ళాను.

మా తమ్ముడ్ని చూస్తూనే పిల్లలు చాక్ లెట్ల కోసం అల్లరిచేశారు. అతను వాళ్ళను తీసుకుని బజారు వెళ్లాడు. నేను ఏదో దొరికిన పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాను.

“హలో” ఆ పిలుపు మరీ దగ్గరగా వినిపిస్తే గబుక్కున తలెత్తి చూశాను.

ఎదురుగ్గా జయంత్.

“ఎప్పుడొచ్చారు? ఇక్కడున్న పూలకుండీల్లో మీరూ ఓపూల మొక్కలా కలిసిపోయారు” అన్నాడు. అతను గాఢంగా చెబుతున్నట్టు అనిపించడంవల్ల అనుకుంటాను అతను చాలా అడ్వాన్స్ డ్ అయిపోతున్నాడని అనుకోకుండా గర్వంగా ఫీలయ్యాను. చప్పున సిగ్గు ముంచుకొచ్చింది.