నేను బాకీ వుంది ఆయనకే 3 76

మా ఊర్లో అమ్మాయిల్లో తొంభైశాతం మంది ప్రేమలోపడేవాళ్ళే, కొందరు చూపులతో పుల్ స్టాప్ పెట్టేస్తే, మరికొందరు ఉత్తరాల వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు. ఇంకొందరు సినిమాలకు పోవడం వరకు వస్తే, ఎవరో ఒకరు మంచం వరకు వెళ్ళేవాళ్ళు. ఇక పెళ్ళివరకు వెళ్ళడమనేది చాలా రేర్. కులాలు, ఆస్తీ – అంతస్తులు యిలా ఎన్నో అడ్డుగోడలు వుండడంతో పాటు ప్రేమించినవాడ్నే పెళ్ళి చేసుకోవాలన్న పరిణితి రాకపోవడం కూడా ఓ కారణం. ఏదైనా ఫ్రీగా చర్చించే స్వేచ్ఛనివ్వని తల్లి తండ్రులకు భయపడే చాలామంది అమ్మాయిలు మధ్యలోనే టాటా చెప్పేసేవాళ్ళు.

నేనూ అంతే. మానాన్న మంచివాడే కానీ ఈ విషయంలో మాత్రం చండశాసనుడు. నేను సుధీర్ ను చేసుకుంటానంటే ఇంట్లో ఎంత రభస జరుగుతుందో తెలుసు కాబట్టి అమ్మా వాళ్ళు తెచ్చిన సంబంధమే చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను.

పెళ్ళి చూపులయ్యాయి. అందరికీ అన్నీ నచ్చాయి. గనుక ఆ రాత్రి ఇరువైపులా పెద్దలంతా కట్న కానుకల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

పెళ్ళి చేసుకునే వాళ్ళ ముందు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్చల్లో మునిగిపోయారు.

పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులూ కట్నకానుకల దగ్గర కనబరిచిన లేకిబుద్ధిని చూస్తుంటే పెళ్ళి కుదిరిందన్న సంతోషం స్థానే దిగులు ప్రారంభమైంది. నేనేదో మొసళ్ళ మడుగులోకి అడుగుపెడుతున్నట్లనిపించింది.

“విస్తర్లుగా అరిటాకులే వేయాలి……” అని కండిషన్ పెట్టాడు కాబోయే మామయ్య.

“పాయసం దొన్నెలు బాగా పెద్దవి కుట్టించండి. మా బంధువులంతా పెద్ద మహారాజులు. చిన్న దొన్నెలు పెడితే నామోషీగా వుంటుంది” అంది మా అత్తమ్మ.

“పెళ్ళి అట్టహాసంగా జరిపించాలి. నా ఫ్రెండ్స్ చాలామందే వస్తారు పెళ్ళికి” అని ప్రగల్భాలు పలికాడు పెళ్ళికొడుకు.

ఇలాంటి కండిషన్ లతో బాటు ముప్ఫైవేల రొక్కం, పాతికసవర్ల బంగారానికీ బేరం సెటిలైంది.

ఇక లేస్తారేమో అనుకుంటూ వుండగా పెళ్ళికొడుకు మరోమారు తన టేస్టును తెలియజేస్తూ కోర్కెల చిట్టా విప్పాడు.

“సీకో వాచీ, వైట్ డయల్, డే, డేటూ వుండాలి” అన్నాడు.

“కాశీ ప్రయాణం అప్పుడు గొడుగు పెడతారు కదా. లేటెస్ మోడల్ కొరియా గొడుగైతే బావుంటుంది” అని సూచించాడు.