నేను బాకీ వుంది ఆయనకే 3 76

“అలా ఎప్పుడో ఏదో జరుగుతుందని మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకోకుండా వుండలేం కదా.”

“బహుశా నా అనుభవాలన్నీ నన్ను అలా భయపడేటట్లు చేశాయనుకుంటా. జీవితమంటే ముసుగుదొంగలా అనిపిస్తూ వుందంటే నేను ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నానో ఊహించు. అసలు ఆనందానికీ, విషాదానికి, మంచికీ….. చెడుకీ డిఫరెన్స్ ఏమిటో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నాది.”

* * *

అతను గారాబంగా అడిగాడు “ఏం జరిగిందో చెప్పవూ?” అని.

ఆమె చెప్పటం ప్రారంభించింది.

“నాకు ఇప్పుడు ముప్ఫై ఏళ్ళు. నాకు వయసొచ్చిన మూడు సంవత్సరాలకు నా పెళ్లి శ్రీనివాసరావుతో జరిగింది.

నా పెళ్ళి నాటికి ఆయన ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కొత్త కాపురం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. వీటినన్నిటినీ ఆకళింపు చేసుకుని తిరిగి చూసుకుంటే ఇద్దరు పిల్లలు, కాస్తంత లావెక్కిన శరీరమూ మిగిలాయి.

చాలారోజుల ప్రయత్నాల తరువాత మావారికి స్వంత ఊరైనా తిరుపతికి ట్రాన్స్ ఫర్ అయింది. మా ఆయన పుట్టి పెరిగిన ఊరు తిరుపతి దగ్గర్లోని ఓ పల్లెటూరు. మా అత్తామామలు, మా వారి బావమరిది మధుసూదన్ ఆ ఊర్లో వుండేవారు. మేము తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకుని స్థిరపడ్డాం.

దగ్గరికి వచ్చేశాం కనుక మా వారు రోజూ ఊరెళ్ళి వ్యవసాయం చూసుకునేవాళ్ళు. కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడేవారు. ఇందులో భాగంగానే బావమరిది మధుచేత చంద్రగిరిలో నర్సరీ పెట్టించాడు. పూలమొక్కల వ్యాపారం అన్న మాట.

నా జీవితం అంతవరకూ సాఫీగా జరిగిపోయింది. అదిగో అక్కడే ఓ పెద్ద కుదుపుకు లోనయ్యింది ఆ కుదుపు పేరు జయంత్.

అతను నాకంటే చాలా చిన్నవాడు. మధుకి మంచి ఫ్రెండ్. రోజూ సాయంకాలం తన మిత్రులతో వచ్చి నర్సరీలో బాతాఖానీ వేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ, పిల్లలూ కలిసి నర్సరీకి వెళ్ళి, కాసేపు గడిపి తిరిగి అందరం రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం.

మావారికి పూర్తి ఆపోజిట్ జయంత్. అప్పుడే ఎం.ఏ పూర్తి చేశాడు. పెళ్ళి ఆలోచన ఇంకా రాని వయసు. ఇరవై రెండేళ్ళు వుంటాయేమో, సన్నగా , పొడవుగా, రొమాంటిక్ గా వుండేవాడు.

సాయంకాలం అయ్యేసరికి నీట్ గా టక్ చేసుకుని కనిపించేవాడు జయంత్. ప్రతి అరగంటకీ టీ తాగి, సిగరెట్ అంటించేవాడు. గ్రూప్ లో అతనిదే డామినేషన్. అన్నిటికన్నా అతనిలో నన్ను ఆకర్షించింది అతని స్టేట్ మెంట్స్.

“అత్తకీ, కోడలకీ పడకపోవడం ఎందుకో తెలుసా? ఫ్రాయిడ్ మాటల్లో చెప్పాలంటే కాంప్లెక్స్- అంటే తల్లికి కొడుకు మీద వుండే ఓ విధమైన ప్రేమ. ఇప్పుడొచ్చిన కోడలు కొడుకుని మంచం మీద పంచుకుంటూ వుందన్న ఆలోచనను తల్లి భరించజాలదు. అందుకే ప్రతి అత్తా కోడలు నిద్ర ఆలస్యంగా లేస్తూ వుందన్న ఆరోపణతోనే యుద్ధం మొదలుపెడుతుంది.”