నేను బాకీ వుంది ఆయనకే 3 78

“గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు” నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు.

“చూశానులేరా” అని “తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి. కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం” అంటూ అతను వెనక్కి తిరిగాడు.

అర్జున్ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు.

సరిగ్గా అప్పుడే ధాన్య వాళ్ళను చూసింది. ఆమె గోపాలకృష్ణను ఉద్దేశించి “హలో” అంటూ గట్టిగా అరిచింది.

అతను ఆగి ఆమెవైపు తిరిగి పలకరింపుగా నవ్వి ‘హలో’ అంటూ కుడిచేయి పైకెత్తి విష్ చేసినట్టు ఊపాడు.

“మనిద్దరం ఒకే గట్టుమీద నడుస్తూ ఎదురుపడటం ఫెంటాస్టిక్ గా వుంది. నువ్వు చాలాదూరం వచ్చేశావు కాబట్టి నవ్వు వచ్చేయ్. మేం వెనక్కి వెళతాం” అంది ఆమె.

ఇక తప్పదని గోపాలకృష్ణ ముందుకి నడిచాడు. అర్జున్ కి అలా పొలాల గట్లమీద నడిచే అలవాటు లేదు. అందుకే కాలు స్లిప్ అవుతుందేమోనని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు.

గోపాలకృష్ణ వాళ్ళను సమీపించాడు.

ఆ సమయంలో వస్తున్నది ఎవరా అన్న క్యూరియాసిటీ కూడా లేకుండా ఆకాశాన్ని చూస్తోంది వర్ష. ఆమెకి అతను గోపాలకృష్ణ అని తెలియదు. వస్తున్నవాళ్ళు గట్టు దాటడానికి కొంత సమయం పడుతుంది గనుక వాళ్ళను చూస్తూ నిలబడడం కన్నా అలా ఆకాశంవైపు చూడడం బావుంటుందన్న ఉద్దేశంతో అలా తల పైకెత్తి వుండిపోయింది.

నీలం ఆకాశంమీద ఎర్రటి షేడ్ ను చూస్తూ ఆమె ముగ్ధురాలవుతోంది. ఆ రంగుల మిక్సింగ్ కు అబ్బురపడుతూ వుండగా గోపాలకృష్ణ పూర్తిగా గట్టుదాటి అక్కడికి వచ్చాడు.