నేను బాకీ వుంది ఆయనకే 3 76

నిజానికి అతను అలా కాంప్లిమెంట్ చేయడం హద్దుమీరడమే. కానీ కొన్ని ఏళ్లుగా ఓ రొటీన్ జీవితానికి అలవాటు పడడంవల్ల ఏదో మార్పును కోరుకుంటోంది మనసు. అందుకే అతనిమీద కోపం రాలేదు. పైపెచ్చు అదో విధమైన గర్వం నన్ను పోంగించింది.

మావారు ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరుగరు. నేనెప్పుడయినా కొత్తచీర కట్టుకున్నా ఆయన కామెంట్ చేయరు సరికదా పరిశీలించి కూడా చూడరు. మొదట్లో ఆయన ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా ఆ తరువాత సర్దుకున్నాను. ఎప్పుడూ ఆయన నుంచి నేను ఎలాంటి కాంప్లిమెంట్లూ ఆశించలేదు.

“మీవారు ఒంగోలు వెళ్ళారు కదా. మరి నా కోరిక తీరుస్తారా?వస్తాను.”

చప్పున తలెత్తాను. నా కళ్ళల్లో కోపం ప్రస్ఫుటం అయిందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా రక్తమంతా ఏదో హడావుడిగా పరుగులెత్తడం తెలుస్తూనే వుంది.

విచిత్రమేమంటే అతను తడబడలేదు. ఈసారి మరింత స్పష్టంగా అడిగాడు- “వీణారవళి వినే భాగ్యం కల్పిస్తారా?”

అదీ సంగతి. అంతకుమించి ఆలోచించనందుకు నాకు నాకే ఎబ్బెట్టుగా వుంది.

ఏమీ చెప్పకుండా తల వంచుకున్నాను.

“రేపు సాయంకాలం ఆరుగంటలకు వస్తాను” మెల్లగా చెప్పాడు. నేను నోరు తెరవబోయేంతలో మధుసూదన్, పిల్లలు వస్తూ కనిపించారు.

అతను వాళ్ళను చూసి ‘హాయ్’ అంటూ ఎదురెళ్లాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే మిగలిన మిత్రులు వచ్చారు. అందరూ కబుర్లలో పడ్డారు.

నేను పిల్లల్ని తీరుకుని ఎనిమిది ప్రాంతాన తిరిగి ఇంటికొచ్చేశాను.

ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఏవేవో ఆలోచనలు. ఇలాంటి అవస్థ అంతా పెళ్ళికి ముందు అనుభవించాల్సింది. కానీ నాకు వీలు కాలేదు. నాకు బాగా స్పృహ తెలిసేలోగా పెళ్ళి జరిగిపోయింది.

ఒక మగవాడి కోసం సాయంకాలమయ్యేసరికి అందంగా అలంకరించు కొని వెయిట్ చేయడం, అతను వీధిలో అటు వెళుతుంటే ఓరగా చూడడం, ఏ రాత్రో వీధిదీపాలు లేనిచోటు అతను గబుక్కున ముద్దు పెట్టుకుంటే తెల్లారేవరకు అక్కడ తీయతీయగా సలపడం, ఏ ఏడు గంటలప్పుడో ఎవరో చిన్నపిల్ల వచ్చి ‘అక్కా! ఆ అన్న నీకు ఇది ఇమ్మన్నాడు’ అని లవ్ లెటర్ ఇవ్వడం, దాన్ని ఏ అర్థరాత్రో అందరూ నిద్రపోయాక కిరోసిన్ దీపాన్ని బాగా తగ్గించుకుని దొంగతనంగా చదవడం ఇవన్నీ యవ్వనంలో జరగాలి. లేకపోతే యవ్వనానికి అర్థం లేదు. ఇలాంటి అనుభవాలు ఏమీ లేకుండా డైరెక్టుగా పెళ్ళి చేసుకోవడం ఎంత నిస్సారమో తెలుస్తోంది నాకు. మళ్ళీ నాకు యవ్వనం వచ్చిన ఫీలింగ్. ఇది చాలా గొప్ప అనుభూతి.
తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది. పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆలస్యంగా నిద్రలేచాను. మెలుకువ రాగానే ఆ రోజు సాయంకాలం జయంత్ వస్తాడన్న ఆలోచన వెచ్చవెచ్చగా నన్ను పెనవేసుకుంది. ఏదో తెలియని ఉత్సాహం, థ్రిల్లింగ్ నన్ను కుదిపేశాయి. నాకు ఒక్కదానికే పండగ వచ్చినట్లుంది.

చకచకా పనులు చేశాను. పిల్లలిద్దర్నీ స్కూలుకి పంపాను. ఏ పని చేస్తున్నా జయంత్ వస్తాడన్న ఆలోచన అంతర్లీనంగా కలకలం లేపుతోంది. పాతదనంతో మాసిపోయిన ప్రపంచానికి కొత్తగా వెల్లవేసినట్లుంది. ప్రపంచంలోని అందాలన్నీ నాకొక్కదానికే కనిపిస్తున్నాయి. ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్న నేను అందరికంటే అధికురాలినన్న గర్వం సన్నగా పాకుతుంది. మిగిలిన అందరూ ఏదో రొటీన్ గా జీవచ్ఛవాలుగా దొర్లుకుంటూ పోతున్నట్టనిపించింది.